ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ క్లియర్‌

 హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్య తీరిపోయింది. ఐటీ కారిడార్‌కు కేంద్ర బిందువుగా ఉన్న బయోడైవర్సిటీ జంక్షన్‌లో వాహనదారుల ఇక్కట్లను దూరంచేసేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ) లో భాగంగా రూ.69.47 కోట్లతో నిర్మించిన లెవల్‌-2 ఫ్లై ఓవర్‌ను సోమవారం పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు.. సహచర మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. మెహిదీపట్నం నుంచి బయోడైవర్సిటీ మీదుగా మైండ్‌స్పేస్‌ ఐటీ కారిడార్‌కు చేరుకొనేవారికి.. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గనున్నాయి. మూడు లేన్లతో 990 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. గంటకు వేలసంఖ్యలో వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో జటిలంగా మారిన ట్రాఫిక్‌ సమస్యను తొలగించేందుకు ఈ ఫ్లైఓవర్‌ను ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ప్రాజెక్టు సీఈ శ్రీధర్‌, జోనల్‌ కమిషనర్‌ హరిచందన, సాంఘిక సంక్షేమశాఖ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ రాగం సుజాత యాదవ్‌, కార్పొరేటర్లు హమీద్‌ పటేల్‌, సాయిబాబా, నాగేందర్‌యాదవ్‌, జగదీశ్వర్‌గౌడ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు